D Educt: Nov 7: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 161 కొత్త పీజీ సీట్లు మంజూరు

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 వైద్య విభాగాలకు సంబంధించి జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) కొత్తగా 161 పీజీ సీట్లను మంజూరు చేసింది. వీటిలో అత్యధికంగా ఆర్థోపెడిక్స్ విభాగానికి 27 సీట్లు కేటాయించింది. చర్మ, సుఖవ్యాధుల విభాగం (డీవీఎల్‌), ఈఎన్‌టీ, పాథాలజీ విభాగాలకు 16 చొప్పున, రేడియో డయాగ్నసిస్‌కు 14 సీట్లు మంజూరయ్యాయి.

అలాగే పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు 12 చొప్పున సీట్లు కేటాయించారు. జనరల్ మెడిసిన్, ఎనస్థీషియాలజీ, ఆఫ్తల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్ విభాగాలకు ఎనిమిది చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్, ప్రసూతి-గైనకాలజీ, సైకియాట్రీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలకు నాలుగు చొప్పున కొత్త పీజీ సీట్లు మంజూరయ్యాయి. దీంతో ఆయా విభాగాల్లో పీజీ వైద్య విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం మంజూరైన 161 పీజీ సీట్లను 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టడం, పడకల సంఖ్య పెంచడం, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చడం, మౌలిక వసతులను మెరుగుపర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ఫలితంగానే అదనపు పీజీ సీట్ల మంజూరు సాధ్యమైందని డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ నవంబరు 6న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కొత్త సీట్లతో రాష్ట్రంలో వైద్య నిపుణుల తయారీకి మరింత అవకాశం కలగడంతో పాటు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ విద్యా ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.