
కర్నూలు, అక్టోబర్ 6: ఉమ్మడి కర్నూలు జిల్లావాసులకు ఆధార్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఆధార్ కార్డులో మార్పులు, ఇతర సేవల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా కర్నూలులోనే యూఐడీఏఐ ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ఆధార్ నమోదు నుంచి వివరాల అప్‌డేట్ వరకు పలు సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజీ సమీపంలో అటవీశాఖ కార్యాలయం పక్కన చల్లా కాంప్లెక్స్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ తదితర వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు పోయినా, డీయాక్టివేట్ లేదా లాక్ అయినా, బయోమెట్రిక్ సమస్యలు ఉన్నా ఇక్కడే సేవలు పొందే అవకాశం ఉంది.
ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు ఉచితంగా చేస్తారు. ఐదేళ్లు, 15 ఏళ్లు పూర్తైన వారికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (ఎంబీయూ) సేవను ఉచితంగా అందిస్తారు. ఈ-ఆధార్ ప్రింట్, ఆధార్ పీవీసీ కార్డు, ఆధార్ స్టేటస్ చెక్, కార్డు డౌన్‌లోడ్, మొబైల్ నంబర్ లింక్, అప్‌డేట్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
సేవలకు నిర్ణీత రుసుములు
పేరు, పుట్టిన తేదీ, చిరునామా, లింగం, ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్‌కు రూ.75 చొప్పున రుసుము వసూలు చేస్తారు. ఫొటో, బయోమెట్రిక్, ఐరిస్ అప్‌డేట్‌కు రూ.125, ఆధార్ నంబర్ సెర్చ్, ఈ-ఆధార్ ప్రింట్‌కు రూ.40 చెల్లించాలి. కొత్త ఆధార్ నమోదు, ఐదేళ్లు, 15 ఏళ్లు పూర్తైన వారికి ఎంబీయూ అప్‌డేట్ వంటి నిర్దిష్ట సేవలు ఉచితంగా అందిస్తారు.
ఆధార్ సేవలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9420231513 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లావాసులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
