తూర్పు తెలంగాణలో సహజ వనరులకు కొరత లేదు. అయితే, ఆ వనరుల ద్వారా సృష్టించబడుతున్న ఆర్థిక విలువలో ఎంత భాగం స్థానికంగానే నిలుస్తోందన్నది కీలకమైన ప్రశ్న. వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలిపోతే రైతులకు ముడి సరుకు విక్రయం ద్వారా వచ్చే ఆదాయమే పరిమితమవుతుంది. అదే ఉత్పత్తులను స్థానికంగా ప్రాసెసింగ్ చేస్తే పరిశ్రమలకు ఆదాయం సమకూరుతుంది. ప్యాకేజింగ్ ద్వారా అదనపు విలువ చేకూరగా, బ్రాండింగ్, మార్కెటింగ్‌తో ఉత్పత్తులకు మరింత గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. కాబట్టి తూర్పు తెలంగాణ అభివృద్ధిలో తదుపరి అడుగు కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా, స్థానిక వనరులకు విలువ జోడించి, ఆర్థిక ప్రయోజనాలు ప్రాంతంలోనే నిలిచేలా చూడటం కావాలి.

గత పన్నెండేళ్లలో తూర్పు తెలంగాణ తన అపారమైన వనరుల సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పింది. వ్యవసాయం, బొగ్గు, విద్యుత్, అటవీ సంపద, ఖనిజ వనరులు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన పునాదులు ఈ ప్రాంతానికి బలమైన ఆధారాలు. దీనికి తోడు హైదరాబాద్‌కు సమీపంగా ఉండటం, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తూర్పు భారతదేశ మార్కెట్లకు అనుసంధానమయ్యే భౌగోళిక అనుకూలత ఉండటం తూర్పు తెలంగాణకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి.

అయితే, ఈ వనరులన్నీ విడివిడిగా ఉండిపోతే ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. వాటిని ఉత్పత్తితో అనుసంధానించి, ఉత్పత్తులకు విలువ జోడించి, విస్తృత మార్కెట్లకు చేర్చినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా స్థానికంగా పరిశ్రమలు విస్తరించాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, ప్రజల ఆదాయాలు మెరుగుపడాలి. వనరుల సేకరణ నుంచి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్‌ వరకు ప్రతి దశలోనూ ఆర్థిక కార్యకలాపాలు తూర్పు తెలంగాణలోనే బలపడాలి. అప్పుడే ఈ ప్రాంతం కేవలం వనరులను కలిగి ఉన్న ప్రాంతంగా కాకుండా, వాటిని సమర్థంగా వినియోగించి సంపదను, ఉపాధిని, ఆర్థిక విలువను సృష్టించే అభివృద్ధి కేంద్రంగా ఎదుగుతుంది.

ఖమ్మం ప్రాంతంలో మిరప, పత్తి, వరి, ఉద్యాన పంటల సమృద్ధి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బొగ్గు లభ్యత తూర్పు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదులుగా నిలుస్తున్నాయి. అయితే, వ్యవసాయ ఉత్పత్తులు రైతు పొలం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటికి ఎంత మేరకు విలువ జోడింపు జరుగుతోంది? ఆ విలువలో ఎంత భాగం స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేరుతోంది? అన్నది కీలకమైన ప్రశ్న.

ఖమ్మం ప్రాంతంలో మిరప సాగును శుద్ధి, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతులతో అనుసంధానించాలి. పత్తి ఉత్పత్తికి జిన్నింగ్‌తోపాటు వస్త్ర పరిశ్రమలను జోడించి, స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి. వరి ఉత్పత్తిని ఆధునిక మిల్లింగ్‌, నాణ్యమైన ప్యాకేజింగ్‌, విలువ జోడించిన ఆహార ఉత్పత్తుల తయారీతో అనుసంధానించాలి. పంటను పండించి విక్రయించడం వ్యవసాయంలో ఒక దశ మాత్రమే. అదే పంటను నాణ్యమైన ఉత్పత్తిగా, ప్రత్యేక గుర్తింపు కలిగిన బ్రాండ్‌గా, విస్తృత మార్కెట్లకు చేరే వాణిజ్య ఉత్పత్తిగా మార్చడం మరో కీలక దశ. ఈ పరివర్తన సాధ్యమైతే ఖమ్మం ప్రాంతం సమగ్ర అగ్రో ఇండస్ట్రియల్‌ కేంద్రంగా ఎదిగే అవకాశాలు మరింత విస్తరిస్తాయి.

ఇక భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి బొగ్గు దశాబ్దాలుగా పారిశ్రామిక కార్యకలాపాలకు, ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆధారంగా ఉంది. అయితే, భవిష్యత్తులో ఇంధన రంగంలో చోటుచేసుకునే మార్పులు, బొగ్గుపై ఆధారపడిన పరిశ్రమల పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలను నిర్మించుకోవాలి. గనుల పరికరాల తయారీ, యంత్రాల నిర్వహణ, పారిశ్రామిక సేవలు, సాంకేతిక నైపుణ్య శిక్షణ, ప్రత్యామ్నాయ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలి.

గనుల కార్యకలాపాలు తగ్గినా లేదా నిలిచిపోయినా స్థానిక ఉపాధి, ఆదాయ వనరులు దెబ్బతినకుండా ఉండాలంటే, బొగ్గు ఆధారిత ఆర్థిక వ్యవస్థను క్రమంగా నైపుణ్యాలు, సాంకేతికత, వైవిధ్యభరిత పరిశ్రమల వైపు మళ్లించాలి. వ్యవసాయంలో పంట నుంచి బ్రాండ్‌ వరకు, బొగ్గు రంగంలో గనుల నుంచి ప్రత్యామ్నాయ ఉపాధి వరకు విలువ సృష్టించే వ్యవస్థలను నిర్మించడమే తూర్పు తెలంగాణలో దీర్ఘకాలిక, స్థిరమైన ఆర్థిక వృద్ధికి కీలకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *