నిమ్మకాయ.. వంటకాలకు చక్కని రుచిని అందించడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అందుకే దీనిని వివిధ రకాల వంటకాలు, పానీయాల్లో ఉపయోగిస్తుంటాం. అయితే, కొన్నిసార్లు మార్కెట్‌లో కొనుగోలు చేసిన నిమ్మకాయల నుంచి రసం తీయడం కాస్త కష్టంగా మారుతుంది. ఎంత గట్టిగా పిండినా తక్కువ రసం రావడం, లోపల రసం మిగిలిపోయి వృథా కావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా నిమ్మకాయల నుంచి ఎక్కువ మొత్తంలో రసాన్ని సులభంగా తీయవచ్చు. అసలు ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం పొందాలంటే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. నిమ్మకాయను కోయడానికి ముందు 10–15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. లేదంటే మైక్రోవేవ్‌లో ఉపయోగించడానికి అనువైన పాత్రలో ఉంచి సుమారు 10 సెకన్ల పాటు స్వల్పంగా వేడి చేయవచ్చు. ఇలా చేయడం వల్ల నిమ్మకాయను పిండడం సులభమవుతుంది.

అలాగే, నిమ్మకాయను కోయడానికి ముందు కటింగ్ బోర్డుపై ఉంచి అరచేతితో కొద్దిగా ఒత్తిడి చేస్తూ అటూఇటూ దొర్లించాలి. అనంతరం అడ్డంగా కాకుండా నిలువుగా కోసి పిండితే రసం తీయడం సులభంగా ఉంటుంది. ఇంట్లో నిమ్మకాయల రసం పిండే స్క్వీజర్ లేకపోతే ఫోర్క్‌తో కూడా ప్రయత్నించవచ్చు. కట్ చేసిన నిమ్మకాయలో ఫోర్క్‌ను గుచ్చి, అటూఇటూ తిప్పుతూ పిండితే రసం సులభంగా బయటకు వస్తుంది.

ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నిమ్మకాయలు కొద్దిగా ముడుచుకుని ఎండినట్లు కనిపిస్తే, అవి చెడిపోలేదని నిర్ధారించుకున్న తర్వాత ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టి మెత్తబడిన తర్వాత పిండితే రసం తీయడం సులభం కావచ్చు. ఈ చిన్న చిట్కాలను పాటించడం ద్వారా నిమ్మకాయల నుంచి రసాన్ని వృథా కాకుండా వీలైనంత ఎక్కువగా పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *