వంటలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మసాలా దినుసుగా యాలకులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే వీటిని మసాలాల రాణి అని పిలుస్తారు. మార్కెట్లో ఖరీదైన ధర పలికే యాలకులను ఇంట్లోనే పెంచుకోవచ్చని మీకు తెలుసా? బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కువ స్థలం లేకపోయినా, చిన్న కుండీలో యాలకుల మొక్కను పెంచుకోవచ్చు. అయితే, మొక్క ఆరోగ్యంగా పెరిగేందుకు సరైన మట్టి, తగిన తేమ, నీడతో కూడిన వాతావరణం ఎంతో ముఖ్యం. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లోనే యాలకుల మొక్కను పెంచుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సుగంధ ద్రవ్యాల్లో మసాలాల రాణిగా పేరొందిన యాలకులకు భారతీయ వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉంది. పాయసం, బిర్యానీ, మసాలా టీ వంటి వంటకాల్లో చిటికెడు యాలకుల పొడి కలిపితే చక్కని సువాసనతో పాటు రుచి కూడా పెరుగుతుంది. యాలకుల్లో పొటాషియం, జింక్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో పరిమితంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడవచ్చు. మార్కెట్లో ఖరీదైన మసాలా దినుసుల్లో ఒకటైన యాలకులను ఇంట్లోనే పెంచుకోవచ్చని మీకు తెలుసా? ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో చిన్న కుండీని ఉపయోగించి యాలకుల మొక్కను పెంచుకోవచ్చు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.
మొక్కల ఎంపిక: నారు లేదా విత్తనాలు
యాలకుల మొక్కను నర్సరీ నుంచి తెచ్చుకున్న నారు ద్వారా లేదా విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. నారు మొక్కలను నాటుకోవడం సులభమైన పద్ధతి. విత్తనాల ద్వారా పెంచాలనుకుంటే నాణ్యమైన, తాజాగా ఉన్న యాలకుల విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. యాలకుల కాయల నుంచి విత్తనాలను తీసి శుభ్రం చేసుకోవాలి. అనంతరం వాటిని కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టి నాటుకోవచ్చు. అయితే విత్తనాల ద్వారా మొలకలు రావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మొలకెత్తే శాతం కూడా విత్తనాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
మట్టి మిశ్రమం తయారీ
యాలకుల మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే సారవంతమైన, నీరు సులభంగా బయటకు వెళ్లే మట్టి అవసరం. ఇందుకోసం సాధారణ తోట మట్టికి కోకోపీట్, ఇసుక, వర్మీ కంపోస్ట్‌ను తగిన మోతాదులో కలిపి మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల మట్టిలో తేమ నిల్వ ఉండటంతో పాటు వేర్లకు గాలి అందుతుంది. కుండీలో నీరు నిల్వ ఉండకుండా అడుగున తగినన్ని రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి.
విత్తనాలు నాటే విధానం.. సంరక్షణ
ముందుగా సిద్ధం చేసుకున్న మట్టి మిశ్రమాన్ని చిన్న కుండీ లేదా సీడ్ ట్రేలో నింపుకోవాలి. యాలకుల విత్తనాలను మట్టిపై వేసి, వాటిపై పలుచగా మట్టి పొరను కప్పాలి. అనంతరం నీటిని ఎక్కువగా పోయకుండా తేలికగా చల్లుతూ మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి. కుండీని నేరుగా ఎండ తగలని, తగినంత వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత మొక్కలు కొంత బలంగా పెరిగే వరకు జాగ్రత్తగా సంరక్షించాలి. అనంతరం వాటిని పెద్ద కుండీలోకి మార్చుకోవచ్చు.
అనుకూలమైన వాతావరణం
యాలకుల మొక్కలు వెచ్చగా, తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతాయి. వీటికి పరోక్ష వెలుతురు, పాక్షిక నీడ అనుకూలంగా ఉంటాయి. అందువల్ల బాల్కనీలో నేరుగా తీవ్రమైన ఎండ తగలని ప్రదేశంలో లేదా పెద్ద చెట్ల నీడలో కుండీని ఉంచుకోవచ్చు. మట్టి పూర్తిగా ఎండిపోకుండా తగినంత నీరు అందించాలి. అయితే అధికంగా నీరు పోయడం వల్ల వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు సేంద్రియ ఎరువులు అందించడం ద్వారా మొక్క పెరుగుదలకు తోడ్పడవచ్చు.
యాలకుల పంట చేతికి వచ్చేది ఎప్పుడు?
యాలకుల మొక్క ఏడాది పొడవునా పచ్చగా ఉండి ఇంటికి అందాన్ని ఇస్తుంది. అయితే ఇది నెమ్మదిగా పెరిగే మొక్క కావడంతో పంట చేతికి రావడానికి ఓపిక అవసరం. సరైన వాతావరణం, తేమ, పోషకాలు అందితే సాధారణంగా నాటిన రెండు నుంచి నాలుగేళ్ల తర్వాత పూత, కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మొక్క రకం, పెరుగుదల పరిస్థితులను బట్టి ఈ సమయం మారవచ్చు. కుండీలో పెంచిన మొక్కలకు కాయలు కాయడం కూడా అంత సులభం కాకపోవచ్చు. కాబట్టి మొక్కను క్రమం తప్పకుండా సంరక్షిస్తూ, తగినంత నీడ, తేమ, పోషకాలు అందించాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే యాలకుల మొక్కను పెంచుతూ, దాని పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు.
