
హైదరాబాద్, దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల ముప్పు కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా KYC అప్‌డేట్ పేరుతో మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ సందేశాలు, గుర్తింపు వివరాల దొంగతనం ద్వారా బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వాలెట్లను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
KYC ఎందుకు ముఖ్యం?
‘నో యువర్ కస్టమర్’ (KYC) విధానం ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వినియోగదారుల గుర్తింపును ధ్రువీకరిస్తాయి. ఇందుకోసం పాన్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తాయి. డిజిటల్ విధానంలో ఫొటోలు, వీడియో ధ్రువీకరణ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ వివరాలను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తే బాధితుల పేరుతో నకిలీ ఖాతాలు తెరవడం, రుణాలు పొందడం వంటి ముప్పులు ఎదురవుతాయి.
KYC పేరుతో మోసాలు ఎలా జరుగుతాయి?
- గుర్తింపు వివరాల దొంగతనం: వ్యక్తిగత వివరాలను సేకరించి, బాధితుల పేరుతో నకిలీ ఖాతాలు తెరవడం లేదా రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తారు.
- ఖాతా నిలిపివేత పేరుతో బెదిరింపులు: వెంటనే KYC అప్‌డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ వాలెట్ బ్లాక్ అవుతుందని నకిలీ SMSలు పంపుతారు.
- డబ్బు ఆశ చూపి ఖాతాల వినియోగం: కొంత మొత్తం ఇస్తామని చెప్పి ఇతరుల ఖాతాలను ఉపయోగించుకుంటారు. అనంతరం వాటిని అక్రమ లావాదేవీలకు వినియోగించే ప్రమాదం ఉంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- KYC అప్‌డేట్ కోసం వచ్చిన లింకులను క్లిక్ చేసే ముందు వాటి నిజానిజాలు పరిశీలించండి.
- బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారానే వివరాలను అప్‌డేట్ చేయండి.
- ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దు.
- డబ్బు ఆశ చూపి మీ బ్యాంకు ఖాతాను ఇతరులకు వినియోగించనివ్వకండి.
- అనుమానాస్పద సందేశాలు వస్తే సంబంధిత బ్యాంకును అధికారిక మార్గాల్లో సంప్రదించండి.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. అప్రమత్తతతోనే వ్యక్తిగత వివరాలను, కష్టార్జిత డబ్బును కాపాడుకోవచ్చు.
