
తిరుపతి నగరపాలక సంస్థలో ఎన్నికల కమిషన్ రెండోసారి అవకాశం కల్పించిన 18 డివిజన్లకు శనివారం 38 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఈ డివిజన్లకు 59 నామినేషన్లు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం దాఖలైన నామినేషన్లలో వైసీపీ నుంచి 22 టీడీపీ నుంచి ఒకటి జనసేన నుంచి ఒకటి బీఎస్పీ నుంచి రెండు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 11 ఉన్నాయి.
ఈ నెల 16, 17, 18 తేదీల్లో దాఖలైన నామినేషన్లతో పాటు శుక్ర, శనివారాల్లో సమర్పించిన నామినేషన్లను కలిపి చూస్తే తిరుపతి నగరపాలక సంస్థలోని 66 డివిజన్లకు మొత్తం 543 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా చూస్తే టీడీపీ నుంచి అత్యధికంగా 204 నామినేషన్లు దాఖలయ్యాయి.
వైసీపీ నుంచి 161, జనసేన నుంచి 81, బీజేపీ నుంచి 15 నామినేషన్లు వచ్చాయి. సీపీఐ నుంచి నాలుగు, బీఎస్పీ నుంచి రెండు సీపీఎం కాంగ్రెస్ పార్టీల నుంచి ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. ఇతర పార్టీల తరఫున ఐదు స్వతంత్ర అభ్యర్థుల నుంచి 69 నామినేషన్లు అందాయి. శుక్ర, శనివారాల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఆదివారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్నారు.
కొత్తగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు వాటిని ఉపసంహరించుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.
