
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. తుఫాన్ కదలికలను అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాతావరణం సాధారణంగానే ఉందని నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలకు సూచించారు.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 26 అర్ధరాత్రి నాటికి తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా అక్టోబర్ 27 నాటికి అత్యంత తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మంగళ బుధవారాల్లో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని హోంమంత్రి అనిత ప్రజలకు సూచించారు. తీరప్రాంత ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని అనిత సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని స్పష్టం చేశారు. తుఫాన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని హోంమంత్రి కోరారు.
