విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయంలో గంజాయి కలకలం రేగింది. విశాఖపట్నం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ కేసులో కోల్‌కతాకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (36)ను అధికారులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టి నిందితుడిని గుర్తించారు.

బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా రవాణా

అధికారుల ప్రాథమిక విచారణలో నిందితుడు బ్యాంకాక్‌లో హైడ్రోపోనిక్ గంజాయిని సేకరించి, సింగపూర్ మీదుగా విమానంలో భోగాపురం చేరుకున్నట్లు గుర్తించారు. స్కూట్ విమానంలో వచ్చిన అతడిపై ముందుగానే సమాచారం అందడంతో అధికారులు నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇమ్రాన్ ఖాన్‌ను విచారించగా గంజాయి రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

హైడ్రోపోనిక్ గంజాయితో ఆరోగ్యానికి ముప్పు

మట్టి లేకుండా, ప్రత్యేక పోషక ద్రావణాల సాయంతో పెంచే విధానాన్ని హైడ్రోపోనిక్ సాగుగా పిలుస్తారు. ఈ పద్ధతిలో పండించే గంజాయిలో మత్తును కలిగించే పదార్థాల సాంద్రత మారవచ్చు. అధిక మోతాదులో వినియోగిస్తే ఆందోళన, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు, గుండె స్పందన పెరగడం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డీఆర్ఐ, పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయంలో పట్టుబడిన గంజాయి కేసులో నిందితుడి రవాణా మార్గాలు, ఇతర సంబంధాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *