ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావంపై ప్రజలు ఆందోళన చెందకుండా అదే సమయంలో నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్లు సూచించారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం. హరిందర ప్రసాద్ మాట్లాడుతూ తుఫాన్ కాకినాడ తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఆరు తుఫాన్ సహాయక కేంద్రాలను సిద్ధం చేశామని మంగళవారం ఉదయం నాటికి తీర ప్రాంత ప్రజలను సైక్లోన్ షెల్టర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
మత్స్యకారులను ఇప్పటికే అప్రమత్తం చేశామని సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు జిల్లాలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. అవసరమైనవారు 08842-356801, 98499-03879 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, ఆహారం, టార్చ్లైట్లు వంటి అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు.
తుఫాన్ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. మరోవైపు కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ కూడా జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను పాటించాలని కోరారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం అవసరమైనవారు అధికారికంగా ప్రకటించిన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు, సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు.