తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేరుతో సైబర్ నేరగాళ్లు భక్తులను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఇప్పిస్తామంటూ నకిలీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో టికెట్‌కు రూ.2,000 చెల్లించాలని నమ్మించి, డబ్బులు అందిన తర్వాత స్పందించడం మానేసినట్లు బాధితులు గుర్తించారు.

రూ.2 వేలతో టికెట్.. ఆ తర్వాత నో రెస్పాన్స్!

7209003126 నంబరుతో ఉన్న వాట్సాప్ అకౌంట్ ద్వారా ధనుర్మాసంలో శ్రీవారి సుప్రభాత సేవ టికెట్లు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేసినట్లు సమాచారం. ఒక్కో టికెట్‌కు రూ.2,000 చెల్లించాలని, 10 నిమిషాల్లో డబ్బులు పంపితే టికెట్లు కన్ఫర్మ్ చేస్తామని నమ్మించినట్లు తెలుస్తోంది. టికెట్లు వెంటనే బుక్ చేసుకోకపోతే దొరకవంటూ భక్తులను తొందరపెట్టడంతో పలువురు డబ్బులు చెల్లించారు.

అయితే, డబ్బులు పంపిన తర్వాత అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాము మోసపోయినట్లు భక్తులు గుర్తించారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం.

అధికారిక వెబ్‌సైట్‌లోనే టికెట్లు బుక్ చేసుకోండి

గతంలోనూ నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఛానళ్ల ద్వారా దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదులు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపకుండా జాగ్రత్తపడాలి.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

మరోవైపు, తిరుమలలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ వేడుకలో పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

108 వైష్ణవ దివ్యదేశాల్లో గరుడసేవకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. గరుడ వాహనంపై స్వామివారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

ఈ కార్యక్రమంలో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *