
విజయవాడ మేయర్ ఎన్నికల నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రచారంలో స్నేహపూర్వకంగా కలవడం ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు రాధా వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరడం వెనుక ఏబీ పాత్ర ఉందనే ప్రచారంపై ఆయన తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు.
రాధా వైసీపీని వీడటానికి కారణాలివే!
వంగవీటి రాధాతో తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ సినిమాలో తన తండ్రి వంగవీటి రంగా గురించి చూపించిన కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాధా నిరసనకు దిగారని గుర్తుచేశారు.
ఆ సమయంలో పోలీసులు రాధాను బలవంతంగా తీసుకెళ్లడం తనకు నచ్చలేదని ఏబీ చెప్పారు. ఈ విషయంలో అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అతిగా స్పందించారని ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని తెలిపినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ గౌతమ్ రెడ్డి వంగవీటి రంగా గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా రాధాను బాధించాయని ఏబీ పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పినా, ఆయన పార్టీలో కొనసాగడం రాధా అసంతృప్తికి మరో కారణమైందని వివరించారు.
రాధాకు సలహా ఇచ్చా.. టీడీపీలో చేరారు
వైఎస్సార్‌సీపీలో రాధా ఇబ్బందిగా ఉన్నారని తెలిసి, స్నేహితుడిగా ఫోన్ చేసి మాట్లాడినట్లు ఏబీ తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా తీసుకోవాలని సలహా ఇచ్చానన్నారు. ఆ తర్వాత టీడీపీ నేత టీడీ జనార్దన్ రాధాను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని, రాధా అంగీకరించి టీడీపీలో చేరారని వివరించారు. రాధా ఏ పార్టీలో ఉండాలనేది ఆయన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు.
రాధా కోసం పోటీలోకి దిగలేదు
వంగవీటి రాధాకు మేయర్ సీటు ఇవ్వకపోవడంతోనే తాను పోటీ చేస్తున్నాననే ప్రచారంలో నిజం లేదని ఏబీ ఖండించారు. వామపక్ష పార్టీల నేతలు కోరడంతోనే పోటీకి సిద్ధమైనట్లు చెప్పారు. రాధా అభ్యర్థిగా ఉన్నా, లేకపోయినా తాను బరిలో ఉండేవాడినని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం తనను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించినా, వ్యక్తిగత లక్ష్యాల కారణంగా ఆ పదవిని స్వీకరించలేదని ఏబీ వెల్లడించారు. పదవిలో కాలక్షేపం చేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు.
