ఆంధ్రప్రదేశ్‌పై ఆర్నబ్ తుఫాన్ ప్రభావం జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని లేఖలో వివరించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపించాలని కోరారు.

తుఫాన్ సహాయక చర్యల కోసం 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించినట్లు సీఎం తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని పేర్కొన్నారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 180 ఇళ్లు దెబ్బతినగా రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని చంద్రబాబు వివరించారు. తీర ప్రాంతాల్లో పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు పేర్కొన్నారు.

భారీ వర్షాల కారణంగా సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీటమునిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయని సీఎం తెలిపారు. ఇప్పటివరకు 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉందని లేఖలో వివరించారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. బాధితులకు సహాయక చర్యలు అందించడంతో పాటు విద్యుత్, తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై సమగ్ర అంచనా పూర్తయిన తర్వాత కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.

తుఫాన్ సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర కేంద్ర సంస్థల సహకారాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి నిరంతరం సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *