ఆర్నబ్ తుఫాన్‌ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్ని జోన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. గత రెండు రోజులుగా పర్యటనలు నిర్వహించిన ఆయన ఈదురుగాలులు భారీ వర్షాల కారణంగా నేలకూలిన చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు, ఇతర నష్టాలను సమీక్షించారు.

ప్రజల నుంచి అందే ఫిర్యాదులను స్వీకరించడం వాటిపై చర్యలు తీసుకోవడంలో సిటీ ఆపరేషన్ సెంటర్ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. సెంటర్‌కు అందే ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అదనపు కమిషనర్ ఎస్‌.ఎస్‌. వర్మకు సూచించారు. టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేశారు.

తుఫాన్‌ కారణంగా ప్రధాన రహదారులపై నేలకూలిన, విరిగిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెట్ల కొమ్మలను తొలగించి రహదారులను వెంటనే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి ప్రతి అరగంటకూ నివేదిక సమర్పించాలని అదనపు కమిషనర్‌, ప్రధాన వైద్యాధికారిని ఆదేశించారు.

తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా నీరు కలుషితం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు జీవీఎంసీ పరిధిలో మొత్తం 56 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 12 కేంద్రాల్లో 490 మంది బాధితులకు ఆశ్రయం కల్పించారు. వారికి అవసరమైన భోజన సదుపాయాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *