ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరుద్ధరణ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్లతో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు నిరంతరం పనిచేయాలని స్పష్టం చేశారు.

కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను గురువారం అందజేస్తామని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని, పంట నష్టం మినహా ఇతర నష్టాలకు సంబంధించిన పరిహారాన్ని త్వరగా అందించాలని చంద్రబాబు ఆదేశించారు.

రెండు రకాల ప్రకృతి సవాళ్లు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని సీఎం పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమలో వ్యవసాయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరోవైపు ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో పంటలు, కొబ్బరి చెట్లు, ఇతర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

తుఫాన్ సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేసిందని చంద్రబాబు ప్రశంసించారు. చెరువులు కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూలిన చెట్లను తొలగించామని అధికారులు వివరించగా ఇంకా రహదారులపై చెట్లు ఉంటే వెంటనే తొలగించాలని సీఎం సూచించారు. తుఫాన్ కారణంగా పేరుకుపోయిన చెత్తను కూడా యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు.

రేపటిలోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఆదేశాలు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను శుక్రవారం నాటికి పునరుద్ధరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నష్టపరిహారానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంటూ అర్హులైన బాధితులకు త్వరగా పరిహారం అందించాలని స్పష్టం చేశారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై అంచనాలను ఆలస్యం చేయకుండా సిద్ధం చేయాలని సూచించారు.

పంటలు ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు

నీట మునిగిన పంటలను ఎంతవరకు కాపాడవచ్చో పరిశీలించాలని సీఎం సూచించారు. ఇందుకోసం వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు విద్యార్థులు కలిసి అధ్యయనం చేయాలని తెలిపారు. పంటలు పూర్తిగా దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని సూచించారు. కొబ్బరి చెట్లతో పాటు ఇతర ఉద్యాన పంటలకు చెందిన చెట్లు మొక్కలను తిరిగి నాటేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *