ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్నబ్ తుఫాన్ వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై ప్రధానంగా చర్చించారు.

తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో 40 బోట్లు, కోనసీమ జిల్లా పరిధిలో ఉప్పాడ మత్స్యకారులకు చెందిన 117 బోట్లు దెబ్బతిన్నట్లు పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. తీర ప్రాంతాల్లో బోట్లు, వలలు, చేపల వేటకు అవసరమైన సామగ్రిని కోల్పోయిన మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు.

భారీ వర్షాల కారణంగా ఉప్పాడలో చేనేత మగ్గాల్లోకి నీరు చేరడంతో కార్మికుల జీవనోపాధి దెబ్బతిన్నదని తెలిపారు. నష్టపోయిన చేనేత కార్మికులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తుఫాన్ సమయంలో సీఎం చంద్రబాబు పనితీరుపై ప్రశంసలు

విపత్తు నిర్వహణలో ప్రజల ప్రాణాలు ఆస్తుల రక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తుఫాన్ హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో సీఎం సమర్థంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులకు అభినందనలు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చురుగ్గా నిర్వహించిన మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, నష్టపోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *