అర్నబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. గురువారం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన.. కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తుఫాన్ ప్రభావాన్ని ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేశారు.

అమరావతి నుంచి ప్రారంభమైన సీఎం పర్యటన కాట్రేనికోన మండలం చెయ్యేరు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా దెబ్బతిన్న పంటలు, తోటలు, ఆక్వా చెరువులను పరిశీలించారు. అనంతరం బాధిత రైతులతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఎటుచూసినా నీట మునిగిన పంటలే!

నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం ప్రాంతాల మీదుగా సీఎం హెలికాప్టర్ ప్రయాణించింది. ఈ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నీట మునిగిన పొలాలే కనిపించాయి. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో వరి పంటలు నీటిలో మునిగి దెబ్బతిన్నాయి.

ఈదురుగాలుల ధాటికి అరటి తోటలు నేలకొరగగా, కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. వరద నీరు చేరడంతో ఆక్వా చెరువులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ విరుచుకుపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

రైతులకు అండగా ఉంటామని భరోసా

తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించిన చంద్రబాబు.. బాధిత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *