D Educt: Oct 30: మల్లారెడ్డి యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు?

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సెలవు ప్రకటించి సినిమా ప్రమోషన్‌ కార్యక్రమం నిర్వహించడంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యూనివర్సిటీ యాజమాన్యానికి త్వరలోనే నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నట్లు వెల్లడించింది.

ఈ ఘటనపై విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్‌ నేతృత్వంలోని బృందం గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి. బాలకిష్టారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. తరగతులను రద్దు చేసి వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై వినతిపత్రం సమర్పించింది. దీనిపై స్పందించిన ఛైర్మన్‌ ఘటనపై విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక సేకరిస్తామని, యూనివర్సిటీకి నోటీసులు పంపుతామని హామీ ఇచ్చారు.

మరోవైపు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే దిశగా ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. ఇటీవల ఎంవీఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో దాండియా వేడుకల సందర్భంగా లైటింగ్‌ ఆర్చ్‌ కూలిపడి ఓ విద్యార్థిని మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని క్యాంపస్‌లలో విద్యార్థుల భద్రతకు సంబంధించిన విధివిధానాలతో కొత్త బిల్లు ముసాయిదాను రూపొందించింది.

ఈ ముసాయిదా ప్రతిపాదనలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌కు అందజేసినట్లు ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి తెలిపారు. విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా, నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించినా కఠిన చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *