ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి చేరుకుంది. శనివారం ఉదయం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ఏడుగురు సభ్యుల బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఈ బృందం నేటి నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. వ్యవసాయం, ఆర్థికం, విద్యుత్, జలవనరులు, ఇస్రో, గ్రామీణాభివృద్ధి, రోడ్లు రవాణా శాఖలకు చెందిన అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయనున్నారు.

మన్‌మిత్ర సేవలపై కేంద్ర బృందం ప్రశంసలు

సచివాలయంలోని మొదటి భవనంలో ఉన్న ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్, సీఈవో ప్రఖర్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తుఫాన్ నష్టాన్ని రాష్ట్రంలో చేపట్టిన విపత్తు నిర్వహణ చర్యలను వివరించారు.

ముఖ్యంగా ఆర్టీజీఎస్ ద్వారా అమలు చేస్తున్న విపత్తుల నిర్వహణ విధానంపై కేంద్ర అధికారులు ఆసక్తి కనబరిచారు. మన్‌మిత్ర సేవల గురించి ప్రత్యేకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ సమయంలో మన్‌మిత్ర ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు సమస్యలను స్వీకరించి వాటిని రియల్‌టైమ్‌లో పరిష్కరించిన విధానాన్ని అధికారులు వివరించారు.

ఈ విధానం మంచి ఆలోచనగా అభివర్ణించిన కేంద్ర బృందం.. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి వ్యవస్థను అమలు చేసేలా సూచిస్తామని తెలిపింది.

తుఫాన్ సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపించామని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తం చేయడం వల్ల ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ఆర్టీజీఎస్ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

ఏపీకి రూ.4,764 కోట్ల నష్టం

రాష్ట్ర అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీకి సుమారు రూ.4,764 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. దాదాపు 12 జిల్లాలు తుఫాన్ ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. ముఖ్యంగా కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం సంభవించినట్లు వివరించారు.

ఆర్టీజీఎస్ అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌పై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. తుఫాన్ నష్టాన్ని పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించి రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని కేంద్ర బృందం వెల్లడించింది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *