
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు 14వ వర్ధంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల గుండెచప్పుడుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన గొప్ప ప్రజానాయకుడు ఎర్రన్నాయుడు అని కొనియాడారు.
ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై టీడీపీ బలోపేతానికి జీవితాంతం కృషి చేసిన నాయకుడని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు పార్టీకి అండగా నిలిచారని గుర్తుచేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా నాలుగుసార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎర్రన్నాయుడు నిరంతరం కృషి చేశారని మంత్రి అన్నారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ గళాన్ని బలంగా వినిపిస్తూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటారని కొనియాడారు. పదవుల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చిన ఆయన పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలిచేవారని గుర్తుచేశారు.
ఎర్రన్నాయుడు తనకు కేవలం అన్నయ్య మాత్రమే కాదని రాజకీయ గురువు, మార్గదర్శి కూడా అని అచ్చెన్నాయుడు భావోద్వేగంగా పేర్కొన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు పునాది వేసిన వ్యక్తి ఆయనేనని తెలిపారు. భౌతికంగా దూరమై 14 ఏళ్లు గడిచినా ఆయన జ్ఞాపకాలు తమ మధ్య సజీవంగానే ఉన్నాయని ఎర్రన్నాయుడు ఆశయాలే తనకు మార్గమని ప్రజాసేవే తన లక్ష్యమని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
