
కూటమి పార్టీల ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. అయితే ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు పులివెందులలో ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
హింసకు ప్రేరేపించేలా కూటమి పార్టీలను రెచ్చగొట్టినా నేతలు కార్యకర్తలు సంయమనం పాటించారని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. 28 జిల్లాల్లోని జెడ్పీ స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు.
ప్రతి మండలంలోనూ కూటమి జెండా ఎగరాలని ఎంపీటీసీ స్థానాల్లోనూ ఆధిక్యం సాధించేలా పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆశలు నెరవేర్చేలా సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.
కూటమి స్ఫూర్తితో ఉమ్మడి కార్యాచరణ అమలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలోనే కాకుండా స్థానిక సంస్థల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్థానిక ఎన్నికల అంశంపై తాను పవన్ కల్యాణ్, మాధవ్ చర్చించుకుంటున్నామని వెల్లడించారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని పేర్కొన్న చంద్రబాబు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదయ్యేలా చూడాలని నేతలకు ఆదేశించారు. మన ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
