
నితేశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ సినిమాకు పైరసీ ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా అనధికారికంగా రికార్డు చేయడం, ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడంపై నిషేధం విధించింది. పైరసీని అరికట్టాలంటూ గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
పైరసీ లింకులను తొలగించాలని ఆదేశాలు
‘రామాయణ’ సినిమాకు సంబంధించిన అనధికారిక లింకులు, మిర్రర్ వెబ్సైట్లను గుర్తించి తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సోషల్ మీడియా సంస్థలను హైకోర్టు ఆదేశించింది. పైరసీ కంటెంట్‌కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే వాటిని బ్లాక్ చేయడం లేదా తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మాధవ్ జల్దార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’
విచారణ సందర్భంగా సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన వివరాలను మేకర్స్ కోర్టుకు వెల్లడించారు. ‘రామాయణ’ తొలి భాగాన్ని సుమారు రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. రెండు భాగాలకు కలిపి మొత్తం రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వివరించారు.
సినిమా ప్రివ్యూ ప్రదర్శనల సమయంలోనూ కఠినమైన నిబంధనలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, రెండు ట్రైలర్లను కొందరు రహస్యంగా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల సమయంలోనూ పైరసీ జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 16న జరగనుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాకు పైరసీ నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు తీసుకున్న ఈ చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.
