మురసు తుఫాన్ ప్రభావం ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత చేపట్టాల్సిన సహాయక పునరుద్ధరణ చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారుల కనెక్టివిటీ పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. బాధితులందరికీ సహాయం అందే వరకు అధికారులు నిరంతరం పనిచేయాలని సూచించారు.

ఈరోజు రాత్రికి తుఫాన్ తీవ్రత పూర్తిగా తగ్గే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం పెరిగిందని రానున్న 4 నుంచి 5 గంటలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వెల్లడించారు. 21 పట్టణ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఈరోజు సాయంత్రం వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్న రాత్రి వర్షాలు కురిసినా ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. చెరువులు రిజర్వాయర్లు వాగులు ప్రమాదకర స్థాయికి చేరకపోయినప్పటికీ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

వర్షపు నీరు వృథా కాకుండా సమర్థవంతమైన నీటి నిర్వహణ చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం బాపట్ల జిల్లాల్లో అంతరాయం కలిగిన విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

తుఫాన్ సమయంలో అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని చంద్రబాబు ప్రశంసించారు. వారి సేవలకు అభినందనలు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది తక్షణమే స్పందించడంతో తుఫాన్ బాధితుల్లో ప్రభుత్వ చర్యల పట్ల సానుకూల స్పందన వ్యక్తమవుతోందని అధికారులు సీఎంకు వివరించారు.

By Rajini