
మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
అదేవిధంగా తూర్పుగోదావరి, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు ప్రకాశం జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు కొత్తపట్నం ప్రాంతంలో అత్యధికంగా 164.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
