కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో భాగంగా ఆరు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో కూటమి అభ్యర్థులు నాలుగు వార్డుల్లో విజయం సాధించగా స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డులను కైవసం చేసుకున్నారు.

వెలువడిన ఫలితాల్లో టీడీపీ మూడు వార్డుల్లో జనసేన ఒక వార్డులో గెలుపొందాయి. మిగిలిన రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వార్డుల వారీగా ఫలితాలను పరిశీలిస్తే 1వ వార్డులో జనసేన అభ్యర్థి వెన్నా ముత్యాలమ్మ వైసీపీ ప్రత్యర్థిపై 432 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

5వ వార్డులో టీడీపీ అభ్యర్థి మురదా నవీన్ 89 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 9వ వార్డులో టీడీపీ అభ్యర్థి సింగం ప్రవీణ్ మణి 262 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వీర్ల అరుణ బీజేపీ ప్రత్యర్థిపై 459 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

17వ వార్డులో జనసేన రెబల్‌గా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గున్నాబత్తుల రాంబాబు జనసేన అభ్యర్థిపై 345 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి పర్వత సూర్యనారాయణ వైసీపీ ప్రత్యర్థిపై 515 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

మొత్తం 23 వార్డులకు గాను తొలి రౌండ్‌లో ఆరు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం రెండో రౌండ్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు కొనసాగుతుండగా అభ్యర్థులు వారి అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. మిగిలిన వార్డుల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By Rajini