
కామారెడ్డి: ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మంది సీనియర్ విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఆరోపణల తీవ్రతను బట్టి నలుగురిని ఆరు నెలల పాటు, మరో పది మందిని నాలుగు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఒకేసారి 14 మందిపై చర్యలు తీసుకోవడం కళాశాల వర్గాల్లో కలకలం రేపింది.
ఎన్ఎంసీకి ఫిర్యాదుతో వెలుగులోకి..
కళాశాలలో కొందరు సీనియర్లు తమను వేధిస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు వారం రోజుల క్రితం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ఎంసీ అధికారులు స్థానిక పోలీసులతోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. దీంతో కళాశాల యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. ఈ విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ కావడంతోపాటు, ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం.
14 మందిపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటనపై మంగళవారం కళాశాల ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్ వాల్యా, వివిధ విభాగాల అధిపతులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణలో వెల్లడైన అంశాలను పరిశీలించిన అనంతరం 14 మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురికి ఆరు నెలలు, మరో పది మందికి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు
జూనియర్ విద్యార్థులు చేసిన ఫిర్యాదుతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ వాల్యా తెలిపారు. ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నామని, ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. కళాశాల ప్రాంగణంలోనైనా, హాస్టల్లోనైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
