
శ్రీకాకుళం, జిల్లాలో గురువారం (నవంబర్ 5) జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు 1,800 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
జిల్లావ్యాప్తంగా 1,196 పోలింగ్ ప్రాంతాల్లో 2,004 కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 40 మంది సీఐలు, 65 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొననున్నారు.
గత ఎన్నికల అనుభవాలు, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా 129 అతి సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల్లో 308 కేంద్రాలను, 220 సమస్యాత్మక ప్రాంతాల్లో 449 కేంద్రాలను గుర్తించారు. వీటిలో అదనపు బలగాలను మోహరించనున్నారు. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు.
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా
పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, బాడీ వార్న్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి సమీక్షించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు నిషేధం
ఓటర్లు పోలింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ఎస్పీ సూచించారు. ఎన్నికల సిబ్బంది, పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ప్రచారంపై ఆంక్షలు
ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకే ముగిసిందని ఎస్పీ గుర్తుచేశారు. ఆ తర్వాత ప్రచారాలు, ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రచారకర్తలు, సంబంధం లేని వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండకూడదని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
