ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ స్వయంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు.

ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 23 జెడ్పీటీసీ, 408 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎస్పీ ఎన్నికల నిర్వహణను నిరంతరం పరిశీలిస్తున్నారు.

వివిధ మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా చూడాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

ప్రతి ఓటరు ఎలాంటి భయం, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రత కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

By pavan