
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తండ్రి వంగవీటి మోహన రంగా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మరో కీలక విజయాన్ని అందుకున్నారు. 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన రాధాకృష్ణ.. ఇప్పుడు 47 ఏళ్లకు విజయవాడ మేయర్‌గా ఎన్నికయ్యారు. జనసేన అభ్యర్థిగా కూటమి తరఫున బరిలోకి దిగిన ఆయన, వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై 1,30,912 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు లభించాయి.
రంగా కుటుంబానికి రాజకీయ నేపథ్యం
వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లోకి రాకముందే ఆయన కుటుంబానికి విజయవాడలో బలమైన రాజకీయ పునాది ఉంది. ఆయన తండ్రి మోహన రంగా 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన తల్లి రత్నకుమారి 1989, 1994 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు.
అయితే 1999 ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు మారిపోయాయి. టీడీపీలో చేరిన రత్నకుమారికి ఆ ఎన్నికల్లో టికెట్ లభించలేదు. ఆమె స్థానంలో పోటీ చేసిన సినీ నటుడు కోట శ్రీనివాసరావు విజయం సాధించారు. ఈ పరిణామాల తర్వాత కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత రాధాకృష్ణపై పడింది.
కాంగ్రెస్‌తో ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం
2003 చివర్లో రాధాకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 26న మోహన రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కాంగ్రెస్ నేత దాసరి నారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఆయన రాజకీయ జీవితంలో తొలి ప్రధాన విజయంగా నిలిచింది.
పార్టీ మార్పులు.. ఎన్నికల్లో ఎదురుదెబ్బలు
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం పలు మలుపులు తిరిగింది. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి ఎదురైంది.
ఆ తర్వాత 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి మరోసారి పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు దక్కవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగింది. అయితే ఆ అవకాశాలు కార్యరూపం దాల్చలేదు.
జనసేనలో చేరికతో రాజకీయాల్లో కొత్త మలుపు
టీడీపీలో సుమారు ఏడేళ్ల పాటు కొనసాగిన రాధాకృష్ణ.. విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చేరింది.
తండ్రి కార్పొరేటర్.. కుమారుడు మేయర్!
వంగవీటి కుటుంబానికి విజయవాడ నగర రాజకీయాలతో ఉన్న అనుబంధం మరోసారి చర్చనీయాంశమైంది. 1981లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మోహన రంగా కృష్ణలంకలోని 40వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. అప్పటికి ఆయన ఒక హత్య కేసులో జైలులో ఉన్నప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషంగా నిలిచింది.
కార్పొరేటర్‌గా ప్రారంభమైన మోహన రంగా రాజకీయ ప్రస్థానం అనంతరం ఎమ్మెల్యే స్థాయికి చేరింది. ఇప్పుడు అదే విజయవాడ నగరంలో ఆయన కుమారుడు మేయర్ పీఠాన్ని అధిష్ఠించారు. తండ్రి కార్పొరేటర్‌గా పనిచేసిన నగరానికి కుమారుడు మేయర్‌గా ఎన్నిక కావడం వంగవీటి కుటుంబ రాజకీయ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
వైద్య విద్యను వదిలి రాజకీయాల వైపు
1979లో కృష్ణా జిల్లా పెనమలూరులో జన్మించిన వంగవీటి రాధాకృష్ణ గుంటూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం తమిళనాడులోని సేలంలోని వినాయక మిషన్స్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసించేందుకు చేరారు. అయితే చదువును మధ్యలోనే నిలిపివేసి రాజకీయాల వైపు అడుగులు వేశారు.
అలా 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం.. వివిధ పార్టీల్లో కొనసాగుతూ, ఓటములు ఎదుర్కొంటూ, చివరకు 47 ఏళ్ల వయసులో విజయవాడ మేయర్‌గా ఎన్నిక కావడంతో మరో కీలక మైలురాయిని చేరుకుంది.
