
D Spiritual: Nov 5: శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం (నవంబర్ 5) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నవంబర్ 8న జరగనున్న దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా గురువారం ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలిపి తయారు చేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ శుద్ధి కార్యక్రమం పూర్తయిన అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతించారు.
ఇక నవంబర్ 8న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించనున్నారు. ఆరోజు సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దీపాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.
