D Spiritual: Nov 5: వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం

తిరుమల: డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గురువారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. తిరుమలలో బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పది రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు.

గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు ఆయన గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు.

అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గతంలో అనుసరించిన విధానాన్నే ఈసారి కూడా అమలు చేయాలని అదనపు ఈవో సూచించారు. తొలి మూడు రోజుల పాటు ఆన్‌లైన్ ఈ-డిప్ విధానం ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించాలని, ఆ తర్వాతి ఏడు రోజులు సర్వదర్శనం అమలు చేయాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శన క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షించాలని అదనపు ఈవో ఆదేశించారు. సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, క్యూ లైన్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ఈ సమీక్ష సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ రాజేంద్ర, శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ సోమన్నారాయణ, శ్రీ రమాకాంత్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు, ఎస్ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ వేణుగోపాల్, వీజీవో శ్రీ సురేంద్ర, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.