ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది. హార్దిక్ మరో ఫ్రాంచైజీకి మారవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు స్పందించాడు. హార్దిక్ ముంబయిలో కొనసాగాలనుకుంటే కెప్టెన్సీ బాధ్యతలకు దూరంగా ఉండటం మంచిదని అభిప్రాయపడ్డాడు.

హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు

2024 సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే, అప్పటి నుంచి అతడికి అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అదే ఏడాది జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

2025లో ముంబయి పుంజుకుని ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ, ఈ ఏడాది మళ్లీ నిరాశపరిచింది. దీంతో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ పరిస్థితుల కారణంగా జట్టులో హార్దిక్ ఒంటరిగా మారిపోయినట్లు భావించి ఉండవచ్చని రాయుడు అభిప్రాయపడ్డాడు.

కెప్టెన్‌గా కాకుండా మ్యాచ్ విన్నర్‌గా..

“ముంబయి జట్టులో తనను పక్కన పెట్టేశారని హార్దిక్ భావించినట్లు నాకు అనిపిస్తోంది. ఒకసారి అలాంటి ఆలోచన మొదలైతే అది ఒత్తిడికి దారితీస్తుంది. జట్టులోకి వచ్చినప్పటి నుంచి అతడికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితులకు హార్దిక్ కారణమా కాదా అన్నది పక్కనపెడితే.. అతడు ముంబయిలోనే కొనసాగాలనుకుంటే కెప్టెన్‌గా ఉండకపోవడం మంచిది.

ఆటను ఆస్వాదిస్తూ ముంబయికి మ్యాచ్ విన్నర్‌గా మారాలి. మరో జట్టుకు వెళ్లినా కనీసం ఒక్క సీజన్ అయినా అతడిని కెప్టెన్‌గా తీసుకోకపోవచ్చు. పంజాబ్ లేదా సీఎస్కేకు వెళ్తే ఆడేందుకు మంచి అవకాశం ఉంటుంది. కేకేఆర్‌కు వెళ్తే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆ జట్టుకు కెప్టెన్ అవసరం. అక్కడ నాయకత్వ బాధ్యతలు అంత సులభం కాదు” అని అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు.

హార్దిక్ ట్రేడింగ్‌పై కొనసాగుతున్న ఊహాగానాలు

హార్దిక్ పాండ్య ట్రేడింగ్ గురించి కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయి ఇండియన్స్ యాజమాన్యం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా పలు ఫ్రాంచైజీలతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకుని, హార్దిక్‌ను ఆ జట్టుకు పంపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ మార్పిడికి పంజాబ్ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

అయితే, ఈ ట్రేడింగ్‌పై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఐపీఎల్ 2027కు ముందు ముంబయి ఇండియన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.