D Spiritual: Nov 6: భక్తుల సేవ, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత: టీటీడీ ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర

తిరుమల: టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్‌గా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రమాణస్వీకారం అనంతరం ముద్దాడ రవిచంద్ర ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. దేవుని సేవ చేసేందుకు గొప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, మెరుగైన రీతిలో కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పిస్తామని ఆయన తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న మరో 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తామని ఛైర్మన్ తెలిపారు. వారిని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా, సేవాభావం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.

అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలలకు వచ్చే రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆధ్యాత్మిక సేవలు, విద్య, వైద్య రంగాల్లో టీటీడీ సేవలను మరింత విస్తృతం చేయడమే తమ సంకల్పమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జేఈవో (ఆరోగ్యం, విద్య) ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.