
వైద్యం అందించాలంటూ ఓ యువ వైద్యుడిని అపార్ట్‌మెంట్‌కు పిలిపించి, అక్కడ బంధించి దాడి చేసి విలువైన వస్తువులను దోచుకున్న ఘటన కేరళలోని కొచ్చిలో కలకలం రేపుతోంది. ఈ కేసులో తెలుగు చిత్రం ‘మత్తు వదలరా’లో నటించిన అతుల్య చంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
వైద్యం పేరుతో డాక్టర్‌కు ఫోన్
కొచ్చిలోని ఎసెన్ స్ప్రింగేల్ అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని, వెంటనే వైద్యం అందించకపోతే ప్రాణాపాయం ఏర్పడుతుందని ఓ యువ వైద్యుడికి సమాచారం అందింది. ఈ సమాచారం అతుల్య చంద్రతో పాటు మరో నటుడు, ఓ నిర్మాత నుంచి రావడంతో డాక్టర్ ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. రోగికి చికిత్స అందించాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు.
అయితే ఫ్లాట్‌లోకి వెళ్లిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటికే అక్కడ సుమారు 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్‌ను లోపలికి తీసుకెళ్లిన తర్వాత తలుపులు మూసివేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తమ బంధువుపై అతడు దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు దిగారు.
గదిలో బంధించి దాడి.. రూ.3.5 లక్షల వస్తువుల చోరీ
అనంతరం డాక్టర్‌ను బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టడంతో పాటు పిడిగుద్దులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో ముఠాలోని ఓ వ్యక్తి బాధితుడి వద్ద ఉన్న ఖరీదైన స్మార్ట్‌ఫోన్, చేతి గడియారం, వైర్లెస్ ఇయర్ఫోన్లను తీసుకున్నట్లు సమాచారం. ఎదురు తిరిగినా, కేకలు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆ తర్వాత డాక్టర్‌ను ఓ చిన్న గదిలోకి నెట్టి తాళం వేసి నిర్బంధించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బాధితుడి నుంచి సుమారు రూ.3.5 లక్షల విలువైన వస్తువులను అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులకు ఫిర్యాదు.. అతుల్య చంద్ర అరెస్ట్
ఎలాగోలా నిందితుల చెర నుంచి బయటపడిన బాధిత వైద్యుడు నేరుగా కడవంత్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నటి అతుల్య చంద్రతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో మొత్తం 12 మంది వరకు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో తొమ్మిది మంది కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. వైద్యం పేరుతో డాక్టర్‌ను పిలిపించి దాడి చేయడం, దోపిడీకి పాల్పడటం వెనుక అసలు కారణాలేంటి? ఈ ఘటనకు సంబంధించి గతంలోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
