
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల తర్వాత తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో అనుసరించిన విధానం ప్రకారం తొలి మూడు రోజులు ఆన్లైన్ ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించాలని తెలిపారు. అనంతరం మిగిలిన ఏడు రోజులు సర్వదర్శనం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శనం భక్తులకు దర్శన అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మరోవైపు, సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
