
భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రాణ వాయువుగా నిలిచిన వందేమాతరం గేయానికి మోదీ సర్కార్ అత్యున్నత గౌరవాన్ని కల్పించబోతోంది. జాతీయ గీతంతో సమానంగా జాతీయ గేయానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేమాతరం ఆలపించేటప్పుడు అగౌరవంగా ప్రవర్తించినా, అడ్డుకున్నా మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరేసిన మరుసటి రోజే.. సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హంగా నిలుస్తోంది.
జాతీయ గేయం వందేమాతరం కీర్తిని కాపాడేందుకు, దానికి మరింత చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం.. జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971ను సవరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా వందేమాతరం పాడేటప్పుడు అవమానించినా, దానికి విఘాతం కలిగించినా లేదా అడ్డుకున్నా కఠినమైన శిక్షలు విధించనున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి.. బీజేపీ అక్కడ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
1971 నాటి అసలు చట్టం ప్రకారం.. కేవలం జాతీయ గీతం (జనగణమన), జాతీయ పతాకం (త్రివర్ణ పతాకం), భారత రాజ్యాంగాన్ని అవమానించడం మాత్రమే చట్టరీత్యా నేరం. చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జాతీయ గీతాన్ని ఆలపించకుండా అడ్డుకున్నా లేదా పాడుతున్నప్పుడు ఆటంకం కలిగించినా గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించే నిబంధన ఉంది. తాజా కేబినెట్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. జాతీయ గేయమైన వందేమాతరానికి కూడా ఇదే కఠినమైన శిక్షల పరిధిలోకి రానుంది.

