D Educt: Nov 7: డైట్‌ల పనితీరు మెరుగుపర్చేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్‌) పనితీరును మెరుగుపర్చడంతో పాటు, డీఎల్‌ఈడీ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి సెమిస్టర్‌కు సంబంధించిన సిలబస్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రాక్టికల్స్, బోధనాభ్యాసం, ఇంటర్న్‌షిప్‌లు, పరీక్షలను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని స్పష్టం చేసింది. షెడ్యూల్‌లో ఆలస్యం జరిగినా, మార్పులు చేసినా అందుకు గల కారణాలను తప్పనిసరిగా వెల్లడించాలని డైట్‌ ప్రిన్సిపాళ్లకు సూచించింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి డైట్‌ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ఐడీ కార్డులను అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అధ్యాపకులు, శిక్షణ పొందుతున్న విద్యార్థులందరూ ప్రతిరోజూ ఉదయం నిర్వహించే ప్రార్థనా సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపింది. ఈ సమావేశాల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సమకాలీన అంశాలపై అవగాహనతో పాటు సంభాషణ నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

అధ్యాపకులు, విద్యార్థులందరికీ ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) ఆధారిత హాజరు విధానాన్ని తప్పనిసరి చేసింది. డీఎల్‌ఈడీ విద్యార్థులకు థియరీ తరగతుల్లో కనీసం 80 శాతం, ప్రాక్టికల్స్‌లో 90 శాతం హాజరు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి ఒక్కో సెమిస్టర్‌లో రెండు అసైన్‌మెంట్లు, ఒక క్షేత్రస్థాయి ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే రెండో, నాలుగో సెమిస్టర్‌లలో నిర్దేశించిన సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్న్‌షిప్‌ నిర్వహించాలని పేర్కొంది.

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ నెలకు కనీసం ఒక పుస్తకం చదవాలనే నిబంధనను తీసుకొచ్చింది. చదివిన పుస్తకాలపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించింది. అంతేకాకుండా ప్రతి సెమిస్టర్‌లో వారానికి ఒకసారి సదస్సులు, ఉపన్యాసాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అదనపు పరిజ్ఞానం అందించాలని తెలిపింది.

డైట్‌ అధ్యాపకులు వారానికి రెండు రోజుల పాటు పాఠశాలలను సందర్శించి అక్కడి ఉపాధ్యాయులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని విద్యాశాఖ ఆదేశించింది. శిక్షణా కార్యక్రమాల అమలు, విద్యార్థుల అభ్యసన పురోగతి, సంస్థల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి డైట్‌ ప్రిన్సిపల్‌ నెలవారీ, సెమిస్టర్‌ వారీ నివేదికలను కమిషనర్‌కు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.