బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాబోయే రెండుమూడేళ్లలో దర్శకుడిగా మారాలని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నటుడిగా తన ప్రయాణానికి మరో పదేళ్లు మాత్రమే సమయం కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన రాముడి పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌బీర్.. సినిమా నిర్మాణం, కథా రచన, దర్శకత్వంపై తనకున్న ఆసక్తిని పంచుకున్నారు.

స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టా

సుమారు రెండు నెలల క్రితమే ఓ కథ రాయడం ప్రారంభించానని రణ్‌బీర్ తెలిపారు. అయితే కథను రూపొందించడం అంత సులభమైన విషయం కాదని, అందుకే రచయితలంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ఒక కథను తెరపైకి తీసుకురావడం, దాని కోసం ఎంతోమంది ప్రతిభావంతులను ఒకచోట చేర్చడం దర్శకుడికి గొప్ప అనుభూతినిస్తుందని అభిప్రాయపడ్డారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ప్రేక్షకులకు ఓ కథను చెప్పే అవకాశం దక్కడం ఎంతో ప్రత్యేకమని, తాను కూడా అలాంటి అనుభవాన్ని పొందాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఫీల్‌గుడ్ డ్రామా తీయాలనుంది

ప్రేక్షకుల్లో ఆత్మీయత, ఆశావాదాన్ని నింపే కథలంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని రణ్‌బీర్ వెల్లడించారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లైఫ్’, రాజ్‌కుమార్ హిరానీ చిత్రాల తరహాలో అందరినీ ఆకట్టుకునే ఫీల్‌గుడ్ డ్రామాను తెరకెక్కించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దర్శకత్వమే తదుపరి లక్ష్యం

తన కెరీర్‌లో ఇకపై కొత్త దశను ప్రారంభించాలనుకుంటున్నట్లు రణ్‌బీర్ చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి సుమారు 100 నుంచి 125 రోజులే షూటింగ్స్‌లో పాల్గొంటున్నానని, మిగిలిన సమయాన్ని కథలు రాయడానికి ఉపయోగించుకుంటున్నానని తెలిపారు.

‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్ 2’, ‘రామాయణం పార్ట్ 2’ చిత్రాలను పూర్తి చేసిన తర్వాత రెండుమూడేళ్లలో దర్శకుడిగా తన తొలి అడుగు వేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఆ సినిమాలో తాను నటించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నటుడిగా మరో పదేళ్ల ప్రయాణం మాత్రమే ఉంటుందని భావిస్తున్న రణ్‌బీర్.. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్శకత్వంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది.