
భారతరత్న, సీనియర్ రాజకీయ నాయకుడు ఎల్కే అడ్వాణీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో అడ్వాణీ అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు చేశారు.
దశాబ్దాలుగా అడ్వాణీ చేసిన ప్రజాసేవ దేశ ప్రజలకు, భావితరాలకు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు పేర్కొన్నారు. స్వతంత్ర భారత తొలి తరం నాయకుల్లో ఒకరిగా దేశ ప్రగతిలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
ఎన్డీయే ప్రభుత్వంలో అడ్వాణీతో కలిసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
