
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు పది ఫ్రాంచైజీలు తమ జట్లలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నాయి. ఏ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలి? ఎవరిని విడుదల చేయాలనే దానిపై యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. నవంబర్ 17లోగా రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంది. మరోవైపు ట్రేడింగ్ ద్వారా ఆటగాళ్లను మార్చుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆటగాళ్ల మార్పిడి జరగగా.. హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్ సింగ్ ట్రేడ్‌పై కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా పలు ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్లపై తన అంచనాలను వెల్లడించాడు. ముఖ్యంగా భారీ ధరకు కొనుగోలు చేసిన కొందరు విదేశీ ఆటగాళ్లకు ఈసారి ఉద్వాసన తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
కోల్‌కతా, చెన్నై జట్లలో మార్పులు?
కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.25.20 కోట్ల భారీ ధరకు తీసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని పుజారా అంచనా వేశాడు. అనంతరం మళ్లీ వేలంలో అతడిని కొనుగోలు చేసే వ్యూహాన్ని అనుసరించవచ్చని పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. మ్యాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్‌లను వదులుకునే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, రాజస్థాన్ రాయల్స్ కూడా ఇదే విధానాన్ని అనుసరించవచ్చని విశ్లేషించాడు.
గుజరాత్, హైదరాబాద్ జట్లలోనూ కోతలు?
గుజరాత్ టైటాన్స్‌లో రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్ల ప్రదర్శన అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో వారిని కొనసాగించే విషయంలో ఫ్రాంచైజీ పునరాలోచన చేసే అవకాశం ఉందని పుజారా పేర్కొన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్‌లను విడుదల చేయవచ్చని అంచనా వేశాడు. పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే.. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు జేవియర్ బార్ట్లెట్, లాకీ ఫెర్గూసన్‌లను కూడా వదులుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
లఖ్‌నవూ, ఢిల్లీ జట్లలో కీలక నిర్ణయాలు
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను కూడా విడుదల చేయవచ్చని పుజారా అంచనా వేశాడు. రూ.21 కోట్ల ధర కలిగిన పూరన్‌తో పాటు ఆయుష్ బదోనీ కూడా విడుదల జాబితాలో ఉండొచ్చని పేర్కొన్నాడు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పృథ్వీ షా, కరుణ్ నాయర్లను పక్కన పెట్టే అవకాశం ఉందని తెలిపాడు. పుజారా అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే ఫ్రాంచైజీల అధికారిక రిటెన్షన్ జాబితా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మినీ వేలానికి ముందు ఈ మార్పులు ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
