బొబ్బిలి, రాజాం తదితర ప్రాంతాల్లో గోగునార పరిశ్రమలు మూతపడటంతో క్రమంగా గోగు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు తక్కువ పెట్టుబడితో రైతులకు మంచి ఆదాయాన్ని అందించిన ఈ పంటను ప్రస్తుతం చాలామంది రైతులు సాగు చేయడం లేదు.

అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటగా గోగు సాగుపై దృష్టి సారించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని చింతాడ, పక్కి, కలవరాయి, కమ్మవలస, ముత్తావలస, శివడవలస తదితర గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో రైతులు గోగు పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహిళలకు ఉపాధి రోజుకు రూ.300 ఆదాయం

గోగు పంట కోత అనంతరం చెరువులు, కాలువల వద్ద నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో గోగు కట్టలను నీటిలో నానబెడతారు. ఆ తర్వాత మహిళా కూలీలు తమ నైపుణ్యంతో కట్టల నుంచి గోగునారను వేరు చేస్తారు. ఒక్కో కట్టకు రూ.10 చొప్పున కూలి చెల్లిస్తుండగా ఒక్కో మహిళ రోజుకు సుమారు 30 కట్టలను వలిచి రూ.300 వరకు సంపాదిస్తున్నారు. దీంతో గోగు నార వేరు చేసే ప్రక్రియ గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం

గోగు పంట తక్కువ పెట్టుబడితో సాగు చేసుకునే వర్షాధార పంట అని వ్యవసాయశాఖ అధికారి మజ్జి శ్యామ్‌సుందర్ తెలిపారు. మెట్ట భూముల్లోనూ ఈ పంటను సాగు చేసుకోవచ్చని తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని, వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *