
కొన్ని ప్రతిపాదనలు అసంబద్ధంగా, ఆమోదయోగ్యం కాకుండా ఉన్నాయి: మార్కో రూబియో
- దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నా కనిపించని పురోగతి
- యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న ఇరాన్
- అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత నిలిచిపోయిన చర్చలు
వాషింగ్టన్, ఆంధ్రప్రభ: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా చేస్తున్న దౌత్య ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. చర్చల్లో ఇరాన్ ప్రతిపాదిస్తున్న డిమాండ్లు ఆమోదయోగ్యం కావని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. కొన్ని డిమాండ్లు అసంబద్ధంగా, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. ఆదివారం ఫ్లోరిడాలోని హోమ్‌స్టెడ్ ఎయిర్ రిజర్వ్ బేస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు పారిస్ బయలుదేరే ముందు చర్చల పరిస్థితిని వివరించారు.
అమెరికా, ఇరాన్ మధ్య పలుదేశాలు మధ్యవర్తిత్వం వహిస్తూ ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాయని రూబియో తెలిపారు. అయితే త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించడం లేదన్నారు. దౌత్యపరమైన పరిష్కారానికి అవకాశం ఉంటే పరిశీలిస్తామని, ప్రస్తుతానికి చర్చల్లో పురోగతి లేదని పేర్కొన్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం చర్చల ప్రక్రియ మందగించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా గతంలో వెల్లడించారు.
యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు
మరోవైపు అమెరికాకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించేందుకు తాము చేసిన ప్రతిపాదనను వైట్‌హౌస్ అంగీకరించాలని, లేదంటే తీవ్ర సైనిక ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల అనంతరం ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించిన అరాగ్చీ.. అమెరికా ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారని, ఇప్పుడు వైట్‌హౌస్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలా? లేక విధ్వంసకర యుద్ధాన్ని ఎదుర్కోవాలా? అన్నది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు.
యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు తాము ప్రతిపాదించిన రెండు రోజుల ప్రణాళిక ఇంకా అందుబాటులోనే ఉందని తెలిపారు. తమ షరతులను అంగీకరిస్తే పరిష్కారం సాధ్యమవుతుందని, యుద్ధాన్నే ఎంచుకుంటే తమ సైనికుల ప్రతాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
