
D Educt: Nov 9: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం శనివారం వెల్లడించింది. విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.
గడువు ముగిసిన తర్వాత ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రూ.50, డిసెంబర్ 3 నుంచి 9 వరకు రూ.200, డిసెంబర్ 10 నుంచి 15 వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.
రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. వయసు మినహాయింపు కోరే విద్యార్థులు రూ.300 అదనంగా చెల్లించాలని పరీక్షల విభాగం స్పష్టం చేసింది.
విద్యార్థులు పరీక్ష ఫీజును తమ పాఠశాల లాగిన్ ద్వారానే చెల్లించాలని అధికారులు సూచించారు. ఇతర మార్గాల్లో ఫీజు చెల్లించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
