
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకుని, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు మౌళి తనూజ్. ఈ సినిమా సక్సెస్‌తో ఆయనకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆయన మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘దొంగ నా కొడుకు’ (DNK).
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మౌళి సరసన సుస్మితా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం క్రింజ్ కామెడీ, సెటైరికల్ డైలాగ్స్‌తో నింపేశారు. టీజర్‌లో మౌళి చంకలో పౌడర్ వేసుకుని ముఖానికి రాసుకునే సన్నివేశం అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక ట్రైలర్‌లో అంతకు మించిన కామెడీ సన్నివేశాలు, డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్స్‌తో మొదలైన కష్టాలు!
ఈ సినిమాలో మౌళి ఓ నిర్లక్ష్యంగా తిరిగే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. స్నేహితుడితో కలిసి సరదాగా కాలం గడిపే అతడికి ఆన్‌లైన్ బెట్టింగ్స్ అంటే పిచ్చి. ఈ వ్యసనం కారణంగా తన దగ్గరున్న డబ్బంతా పోగొట్టుకుంటాడు. చివరికి తన ప్రేయసి దగ్గర ఉన్న బంగారాన్ని కూడా అమ్మి అప్పులు తీర్చేస్తాడు.
ఈ విషయం ప్రేయసి తల్లిదండ్రులకు తెలియడంతో నెల రోజుల్లోగా డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. దీంతో చేసేదేమీ లేక హీరో తన స్నేహితుడితో కలిసి ‘గుండు బాస్’ జ్యువెలరీ షాప్‌లో దొంగతనానికి పాల్పడతాడు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి.
మరోవైపు పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు గాలింపు చేపడతారు. మరి ఈ దొంగతనం తర్వాత హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడా? దొంగిలించిన బంగారం ఏమైంది? చివరికి అతడిలో మార్పు వచ్చిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి ట్రైలర్‌తో ‘దొంగ నా కొడుకు’ సినిమాపై చిత్రబృందం అంచనాలను పెంచింది.
