
మంచి కథల్లో భాగం కావడమే తన ప్రధాన లక్ష్యమని, ఇతర విషయాలేవీ తన నిర్ణయాలను ప్రభావితం చేయవని యువ కథానాయిక అనస్వర రాజన్ చెబుతున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో పలు విజయవంతమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.
కొత్త నటుడు అనీష్ కథానాయకుడిగా నటించిన ‘ఇట్లు అర్జున’ చిత్రంలో అనస్వర హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె తన సినీ ప్రయాణం, కొత్త సినిమాలు, తెలుగు పరిశ్రమలో అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
చిరంజీవి, రవితేజ సినిమాల్లో కీలక పాత్రలు!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాక’ సినిమాలో భాగం కావడం గొప్ప అనుభవమని అనస్వర తెలిపారు. చిరంజీవి సెట్‌లో ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారని, నటనతో పాటు వ్యక్తిత్వం పరంగా కూడా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెప్పారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు.
అలాగే రవితేజ నటిస్తున్న ‘తులాభారం’ సినిమాలో తాను హీరోయిన్ పాత్రలో కాకుండా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. సంగీత్ శోభన్‌తో కలిసి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోనే దీపావళి వేడుకలు!
కేరళలో తెలుగు రాష్ట్రాల మాదిరిగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకోరని అనస్వర చెప్పారు. ఈసారి మాత్రం హైదరాబాద్‌లోనే ‘ఇట్లు అర్జున’ చిత్రబృందంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
‘ఇట్లు అర్జున’తోనే తెలుగులోకి మొదటి అడుగు!
తెలుగులో తాను అంగీకరించిన మొదటి సినిమా ‘ఇట్లు అర్జున’ అని అనస్వర వెల్లడించారు. ఆ తర్వాతే ‘ఛాంపియన్’ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాలతో ‘ఇట్లు అర్జున’ ఆలస్యంగా విడుదలవుతోందని చెప్పారు. సినిమా విడుదల ఆలస్యమైనప్పటికీ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామనే సంతృప్తి ఉందన్నారు.
ఈ సినిమాలో యాక్షన్ అంశాలు ఉన్నప్పటికీ ప్రేమకథ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు.
కీర్తి పాత్రలో కనిపించనున్న అనస్వర
‘ఇట్లు అర్జున’లో కీర్తి అనే యువతి పాత్రలో నటిస్తున్నట్లు అనస్వర తెలిపారు. ప్రతి అమ్మాయికి ఈ పాత్రతో అనుబంధం ఏర్పడుతుందని చెప్పారు. దర్శకుడు మహేశ్ కథ వివరించినప్పుడే కీర్తి పాత్ర తనకు బాగా నచ్చిందని, ఆ పాత్రలో తనను తాను చూసుకున్నానని వెల్లడించారు. అమాయకత్వం, ఉత్సాహం కలగలిసిన పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నారు.
మాట్లాడలేని హీరోతో నటించడం ప్రత్యేక అనుభవం!
ఈ సినిమాలో కథానాయకుడు అనీష్ మాట్లాడలేని వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన పాత్రను ఎంచుకోవడం కూడా తాను ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణమని అనస్వర తెలిపారు.
చిత్రీకరణకు ముందు అనీష్‌తో కలిసి కొన్ని వర్క్‌షాప్‌లలో పాల్గొన్నామని చెప్పారు. ఆయన హావభావాలు, సంజ్ఞలకు అనుగుణంగా తన నటనను సర్దుబాటు చేసుకున్నానని, అలాగే అనీష్ కూడా తన టైమింగ్‌ను అర్థం చేసుకున్నారని వివరించారు. తొలి సినిమానే అయినప్పటికీ అనీష్ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించారని ప్రశంసించారు.
తెలుగు పరిశ్రమలోకి రావడానికి కారణం ఇదే!
మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టడం మొదట కొంత గందరగోళంగా అనిపించిందని అనస్వర చెప్పారు. భాష, సంస్కృతి వంటి అంశాల గురించి ఆలోచించానని తెలిపారు. అయితే ఒక నటిగా విభిన్నమైన కథలు, భిన్నమైన చిత్ర పరిశ్రమల్లో పనిచేయాలనే కోరికతో తెలుగులోకి ధైర్యంగా అడుగుపెట్టినట్లు వెల్లడించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దదని, ఇక్కడి ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు ఎంతో ప్రత్యేకమని అన్నారు. భాష తెలియకపోయినా షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారని చెప్పారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నానని, తెలుగు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ప్రేమ తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు.
అంతేకాకుండా, తన తొలి తెలుగు చిత్రానికే నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించడం కూడా ఎంతో ఆనందాన్నిచ్చిందని అనస్వర రాజన్ పేర్కొన్నారు.
