బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తన తల్లి, దివంగత నటి శ్రీదేవితో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శ్రీదేవి మొదట అంతగా ఆసక్తి చూపలేదని, తన నిర్ణయంపై కొన్ని సందేహాలు వ్యక్తం చేశారని జాన్వీ గుర్తుచేసుకున్నారు.

2018లో ‘ధడక్‌’ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన జాన్వీ.. తాజాగా తన సినీ ప్రయాణం ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. సినిమాల్లోకి రావాలనే తన కోరికను తల్లికి చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయారని తెలిపారు.

ముక్కు సర్జరీ తర్వాతే నమ్మకం వచ్చిందా?

‘‘నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నానని అమ్మకు చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఈ రంగంలోకి అడుగుపెడితే జీవితాన్ని పూర్తిగా సినిమాలకే అంకితం చేయాల్సి ఉంటుందని చెప్పింది. అంతకుముందు నా విషయంలో ఆమెకు అంతగా నమ్మకం ఉండేది కాదు. అయితే నేను ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాత నాలో నటిగా కొనసాగగలిగే లక్షణాలు ఉన్నాయని భావించి అంగీకరించింది’’ అని జాన్వీ వెల్లడించారు.

అందంపై తల్లి ప్రభావం..

తన అందం, వ్యక్తిగత రూపానికి సంబంధించిన విషయాల్లో తల్లి శ్రీదేవి ప్రభావం ఎంతో ఉందని జాన్వీ గతంలోనూ పలుమార్లు చెప్పారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో కనిపించే అందానికి సంబంధించిన ప్రమాణాలను చూసి యువతులు తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దని సూచించారు.

తన సినీ ప్రయాణం ప్రారంభంలో తల్లి నుంచి ఎదురైన అనుభవాలను జాన్వీ తాజాగా పంచుకోవడంతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *