
భూమిలో బంగారం పండుతుందనే మాట వినే ఉంటారు. పంట బాగా పండితే ఆ మాటను వాడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం భూమిలో బంగారం దొరుకుతుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల వ్యవసాయ భూమిలో బంగారం దొరుకుతుందనే ప్రచారంతో ఆ భూమిని కౌలుకు తీసుకునేందుకు స్థానికులు పోటీ పడుతున్నారు. ఇటీవల ఈ పొలంలో కలుపు తీస్తుండగా మహిళా కూలీలకు పురాతన బంగారు ఆభరణాలు లభించడం హాట్ టాఫిక్‌గా మారింది. గతంలోనూ ఆ భూమిలో గుప్త నిధులు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
సాధారణంగా ఏ భూమికైనా పంటలు బాగా పండితే డిమాండ్ ఉంటుంది. కానీ.. ఈ భూమికి మాత్రం పంటలతో పని లేదు. ఎలాగైనా ఆ భూమిని కౌలుకు దక్కించుకోవాలని స్థానికులు ఉవ్విలూరుతున్నారు. మాకంటే మాకు కౌలుకు ఇవ్వాలంటూ భూమి యజమాని చుట్టూ పెద్ద సంఖ్యలో రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ భూమిని దక్కించుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చుననే ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామ పరిధిలో ఉన్న ఒక ఆరెకరాల వ్యవసాయ భూమి ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఆరెకరాల భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఒక వ్యక్తి.. కోపాకులపాడు గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ భూమిని ఈర్యతండాకు చెందిన ఒక రైతు కౌలుకు తీసుకుని ఏటా పత్తి సాగు చేస్తున్నారు. జూన్ 24న వర్షాలు కురవటంతో పత్తి చేనులో కలుపు తీయించడానికి మహిళా కూలీలను రంగంలోకి దించారు. పొలంలో పని చేస్తుండగా మట్టిలో నుంచి పురాతన కాలం నాటి బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. మొదట ఈ విషయాన్ని దాచాలని చూసినా.. గ్రామంలో ప్రచారం జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భూ యజమాని కూలీలను పిలిపించి విచారించగా.. వారు దొరికిన బంగారు వస్తువులను చూపించారు. దీనిపై యజమాని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

