
D Spiritual: Nov 11: వేకువజాము నుంచే పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం
పామర్రు: శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పామర్రులోని స్థానిక శివాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హరిహరుల ఆరాధనకు ఎంతో విశిష్టమైన ఈ మాసంలో తొలి రోజు కావడంతో భక్తులు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధి కూడా అయ్యప్ప దీక్షాపరులు, సాధారణ భక్తులతో కిటకిటలాడింది. దీక్షాపరులు స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ భక్తిభావాన్ని చాటుకున్నారు.
ఉదయాన్నే స్థానిక కాలువలో సంప్రదాయబద్ధంగా పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు తడి బట్టలతో శివాలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక దీపాలంకరణలు చేశారు. ‘హరహర మహాదేవ శంభో శంకర’ అంటూ శివనామస్మరణ చేయడంతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి శివకేశవుల కృపకు పాత్రులయ్యారు. కార్తీక మాసం పొడవునా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, దీపోత్సవాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు లంకా భీష్మ కుమార్ తెలిపారు.
