
తెలంగాణలో అసాధారణంగా పెరిగిన వరి సాగును తగ్గించి, నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ప్రోత్సాహకం అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాధించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కేవలం నిజమైన సాగు భూములకే రైతు భరోసా ఇచ్చి, మిగిలిన నిధులను పంటల బీమా, బోనస్‌లకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు, పంటల సాగు విధానంలో సమతుల్యతను సాధించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా.. మరోవైపు పప్పు ధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఇతర ధాన్యాల దిగుమతి విషయంలో తెలంగాణను స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా, సాంప్రదాయ వరి సాగును పక్కనబెట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపే నిర్ణయించింది.
స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ప్రత్యేక బోనస్ లేదా ప్రోత్సాహకాన్ని అందించాలనే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పుష్కలంగా సాగునీటి లభ్యత ఉండటం, చెరువులు, ప్రాజెక్టులు నిండటం, ఫామ్‌గేట్ వద్దే ప్రభుత్వం నేరుగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఎక్కువగా వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 అదనపు బోనస్ ఇస్తుండటంతో వరి సాగు రికార్డు స్థాయికి చేరింది.

