ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తెలంగాణలోని భద్రాచలం, పాండురంగాపురం వరకు నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌కు పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యగా మారింది. మొత్తం 173.61 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదించిన ఈ మార్గంలో ఏపీలోని పోలవరం జిల్లా పరిధిలో సుమారు 65 కిలోమీటర్లు ముంపు ప్రాంతంలోకి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ కోసం రైల్వే శాఖ సర్వే చేపట్టింది.

ముంపు ప్రాంతానికి ఎగువన కొత్త మార్గం

చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం మండలాల మీదుగా వెళ్లేలా తొలుత రైల్వే లైన్‌ను ప్రతిపాదించారు. ఈ మార్గంలో కుయుగూరు, సీతారామపురం, భీమవరం, రాజుపేట వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే భూసేకరణ సమయంలో చేపట్టిన పరిశీలనలో ప్రతిపాదిత మార్గంలోని అధిక భాగం పోలవరం జలాశయం ముంపు పరిధిలో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ముంపు గ్రామాలకు ఎగువన అనువైన మార్గాన్ని గుర్తించేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే త్వరలో పూర్తికానుండగా, నివేదికను రైల్వే బోర్డుకు పంపించనున్నారు.

పెరగనున్న ప్రాజెక్టు వ్యయం

కొత్త అలైన్‌మెంట్‌ కారణంగా అదనపు స్టేషన్లు, టన్నెల్స్‌ నిర్మించాల్సి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం రూ.2,864 కోట్లుగా అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశముంది. కొత్త మార్గం ఖరారయ్యాక దీనిపై స్పష్టత రానుంది.

మూడు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాలకు ప్రయోజనం

ఈ రైల్వే మార్గంలో ఒడిశాలోని మల్కన్‌గిరితో పాటు బడలి, పనిమట, రాజన్‌గూడ, లచ్చిపేట, కందపల్లి, మోటు ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. ఏపీలో కుయుగూరు, సీతారామపురం, భీమవరం, రాజుపేట, తెలంగాణలో భద్రాచలం, సారపాక వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. పాండురంగాపురం వద్ద ఇప్పటికే ఉన్న రైల్వే లైన్‌కు అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మూడు రాష్ట్రాల్లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడనుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *